
హైదరాబాద్, నిఘా24: ఓవైపు చెరువు అందాలు… మరోవైపు ఎత్తైన కొండ… వీటి మధ్యలో పచ్చదనంతో నిండిన రహదారి… ఇది ఖాజాగూడలో కొత్తగా ఏర్పాటుచేసిన లింక్ రోడ్డు అందాలు. ఈమధ్యే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఖాజాగూడ లింక్ రోడ్డు ఐటీ కారిడార్ వాసులకు కొత్త చిల్లింగ్ స్పాట్ గా మారింది.

ఉదయం ప్రశాంత వాతావరణంలో వాకింగ్ చేసే వాకర్లకు ఆహ్లాదాన్ని అందిస్తుండగా, సాయంత్రం ప్రకృతిని ఎంజాయ్ చేసే ప్రకృతి ప్రియులను ఉత్సాహపరుస్తుంది. ఇక అర్ధరాత్రి వేళ చెరువు కట్టపై పచ్చటి చెట్లు, పూల మొక్కల మధ్య దీపాల వెలుగులో కేక్ కటింగ్ వేడుకలకు వేదికగా ఈ రహదారి నిలుస్తుంది. మొత్తంగా ఐటీ కారిడార్ వాసుల చెంతకు మరో మినీ ట్యాంక్ బండుగా ఖాజాగూడ లేక్ రోడ్డు చెంతకు వచ్చింది. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ నుంచి ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు వరకు ఏర్పాటుచేసిన ఈ రహదారి ప్రకృతి ప్రియులను అలరిస్తుంది.

పచ్చటి గార్డెనింగ్, పూల మొక్కలు, రహదారి మధ్యలో రాతి శిల్పాలు, పాములా వంకలు తిరిగిన రహదారి మీద ఏర్పాటు చేసిన వీధి దీపాలు, చెరువు నీటిలో ప్రతిఫలించే ఎత్తైన భవనాలు ఈ రహదారికి ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు చెరువు అందాలు, మరోవైపు కొండను చీల్చి ఏర్పాటు చేసిన రహదారి సోయగం ప్రయాణికులకు వింత అనుభూతిని ఇస్తుంది. కాంక్రీట్ భవనాలు, రణగొణ ధ్వనులు లేకుండా సాఫీగా సాగిపోయే ఈ రహదారి మధ్యలో అక్కడక్కడ సందర్శకులు సేదతీరేందుకు సీటింగ్ స్పాట్లను, సెల్ఫీ స్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఐటీ కారిడార్ లోని రెండు ప్రధాన రహదారులను కలుపుతున్న ఈ లింక్ రోడ్డు హైటెక్ సిటీ వాసులకు వింత అనుభూతిని పంచుతుంది.
