
హైదరాబాద్ : విదేశాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులను ఖచ్చితంగా పదిహేను రోజులపాటు ఐసోలేషన్ లో ఉంచుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉండగా, గచ్చిబౌలిలోని ఐసోలేషన్ కేంద్రం నుంచి ఒక్కరోజులోనే ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోయారు. దుబాయ్, యెమన్ దేశాలనుంచి గురువారం సాయంత్రం నగరానికి వచ్చిన ప్రయాణికులను అధికారులు గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో గల ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కాగా ఇందులో కొంతమందిని శుక్రవారం ఉదయం అధికారులు వారి సొంత గ్రామాలకు, ఇళ్లకు పంపించివేశారు. విమానాశ్రయంలో వీరికి జరిపిన థర్మల్ స్క్రీనింగ్ లో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడంతో ప్రయాణికులను వారి ఇళ్లకు పంపించి పదిహేను రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్లు తెలిసింది. కాగా గచ్చిబౌలిలోని ఐసోలేషన్ కేంద్రంలో వీరికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా, ఒక్కరోజులోనే ఇంటికి పంపించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులు మొదట నెగిటివ్ రిపోర్టు వచ్చి కొన్ని రోజుల్లోనే వ్యాధి నిర్ధారణ అయిన విషయాన్ని అధికారులు విస్మరించినట్టు తెలుస్తుంది. గచ్చిబౌలి స్టేడియం ఐసోలేషన్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు పలు ప్రైవేటు వాహనాలు, క్యాబ్ లు, కార్లు, ఆటోలలో వారి సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లడం ప్రమాదకరంగా మారుతుందని అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రం విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన ప్రయాణికులను శుక్రవారం ఉదయం ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఇంటికి పంపించడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్ కేంద్రంలో సైతం ప్రయాణికులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదని సమాచారం. ఐసోలేషన్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు పయనమయ్యారు.


2 Comments