
హైదరాబాద్: జనతా కర్ఫ్యూ లో జన చైతన్యం వెల్లివిరిసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేసి స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితం కావడంతో ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

