
హైదరాబాద్ : ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే మన ప్రజాప్రతినిధులు మాత్రం ప్రచార, ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకచోట ఎక్కువగా గుమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెప్తున్నా నాయకులే పెడచెవిన పెడుతున్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఓ వైపు లాక్ డౌన్, కర్ఫ్యూ పేరుతో కఠిన నిబంధనలు చేసి ప్రజలను నిలువరిస్తుండగా బాధ్యత గల ప్రజాప్రతినిధులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రోడ్ల మీద జనాన్ని అడ్డుకుంటూ, నిత్యావసర సరుకుల కు సైతం ఇంటికి ఒక్కరే రావాలని, కారులో ఇద్దరికి మించి ప్రయాణాలు చేయకుండా, కనీసం నడుచుకుంటూ సైతం ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విదిస్తుంటే, మన నాయకులు మాత్రం నిర్లక్ష్యంగా ఇరవై ముప్పై మందితో గుమిగూడు తున్నారు. ముఖ్యమంత్రి చెప్పినా లెక్క చేయకుండా బియ్యం పంపిణీ తంతును భారీగా గుమిగూడి నిర్వహిస్తున్నారు. ఎటువంటి రక్షణ చర్యలు పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. గుంపులుగా కార్యక్రమాలు చేస్తే, అందులో ఎవరైనా కరోనా తో బాధపడేవారు ఉంటే పరిస్థితి ఏమిటిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రచార ఆర్భాటాలకు పోయి ప్రమాదాన్ని సృష్టించవద్దని ప్రజలు సూచిస్తున్నారు.
