
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి మండల పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకలు జరుపుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాలనీ సంఘాల, యువజన సంఘాలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో టిఆర్ఎస్ నాయకులు ఏర్పాటుచేసిన జెండాలను ఎగరవేశారు.

గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, నల్లగండ్ల, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, సింధు రఘునాథ్ రెడ్డిలు హాజరై ఆవిష్కరించారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక వార్డు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను ఎగురవేశారు.

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఖానామెట్ లో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని మండల కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాలింగ్ గౌతంగౌడ్ ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.