
హైదరాబాద్, నిఘా24: ప్రియురాలిని కలిసేందుకు శత్రుదేశంలో అడుగు పెట్టి బందీగా మారిన నగర సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. 2017లో పాకిస్తాన్ అధికారులకు చిక్కి, అక్కడ జైలులో బందీగా మారిన నగర యువకుడు ప్రశాంత్ భారత విదేశాంగ శాఖ, సైబరాబాద్ పోలీసుల కృషితో విడుదలై మంగళవారం నగరానికి చేరాడు. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న ప్రశాంత్ 2017లో తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెళ్లి పాకిస్తాన్ అధికారుల చేతికి చిక్కాడు. ఎటువంటి వీసా, పాస్ పోర్టు లేకుండా పాక్ అధికారులకు పట్టుబడడంతో శత్రుదేశం జైలులో బందీగా మారాడు.
2019లో ప్రశాంత్ తండ్రికి వచ్చిన ఓ ఫోన్ కాల్ తో ప్రశాంత్ పాకిస్తాన్ జైలులో బందీగా ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అప్పటి నుంచి భారత విదేశాంగ శాఖ, సైబరాబాద్ పోలీసులు ప్రశాంత్ విడుదల కోసం కృషి చేయగా, 2 రోజుల క్రితం వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ అధికారులు ప్రశాంత్ ను భారత్ కు అప్పగించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు మంగళవారం ప్రశాంత్ ను నగరానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.