
హైదరాబాద్ : హైదరాబాద్ ఐటీ సంస్థల వేళల్లో ఇకపై మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం వేళ ఒకేసారి అన్ని సంస్థలు కార్యాలయాలు వదిలి పెడుతుండడంతో ఐటీ కారిడార్ రహదారులు ట్రాఫిక్ తో పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురిసిన సమయంలో రహదారులు వాహనాలతో నిండిపోయి కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సాయంత్రం ఇంటికి వెళ్లాలసిన ఉద్యోగులు రాత్రికి గాని ఇళ్ళు చేరడం లేదు. దీనిపై అధికారులు అడుగు ముందుకు వేశారు. జీ హెచ్ ఎం సీ, ట్రాఫిక్ పోలీసులు, ఐటీ సంస్థల ప్రతినిధులు సమావేశం అయ్యారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
1)ఐటీ సంస్థలను క్లస్టర్ లుగా విభజించి ఒక్కో క్లస్టర్లో ఉన్న సంస్థల ఉద్యోగులను ఒక్కో సమయంలో విడుదల చేయడం. ఒక్కో క్లస్టర్ కు కనీసం 15 నిమిషాలు వ్యత్యాసం ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉద్యోగులు ఇళ్లకు చేరవచ్చు.
2) భారీ వర్షాలు కురిసే సమయంలో ఉద్యోగులకు, సంస్థలకు వర్షం, ట్రాఫిక్, వాటర్ లాగింగ్ ప్రాంతాలపై సమాచారం అందించడం.
3) వర్షాలు కురిసే సమయంలో ఉద్యోగులను వర్షం వెలిసే వరకు కార్యాలయాల్లోనే ఉంచడం.
ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ కారిడార్ లో సాయంత్రం ఒకేసారి 5లక్షల మంది ఉద్యోగులు, 3.50 లక్షల కార్లతో రోడ్ల మీదకు వస్తున్నారు. మాములు రోజుల్లో అంతగా ఇబ్బంది లేకపోయినా, వర్షం పడినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని నివారణ కోసమే అధికారులు పలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.