
హైదరాబాద్, నిఘా24: తెలంగాణ కోవిడ్ ఆస్పత్రుల్లో వసతుల ఏర్పాటు కోసం పలు ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీమ్స్) ఆసుపత్రిలో ఐటీ సంస్థలు 15కోట్ల రూపాయలు వెచ్చించి 150 ఐసియు పడకలను ఏర్పాటు చేశాయి. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు మైక్రోసాఫ్ట్, క్వాల్ కామ్, కాగ్నిజెంట్, విల్స్ ఫార్గో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలు కలిసి హైసియా ఆధ్వర్యంలో ఈ కొత్త పడకలను ఏర్పాటు చేశాయి. కరోనా మొదటి వేవ్ లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఐటీ సంస్థలు 80 కోట్ల పరికరాలను అందజేయగా, రెండవ వేవ్ లోనూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి.

శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొత్తగా ఏర్పాటు చేసిన బెడ్లను ప్రారంభించారు. ఆసుపత్రుల్లో సదుపాయాల కోసం ముందుకు వచ్చిన ఐటీ సంస్థలను ఆయన అభినందించారు. జూన్ 10 నాటికి తెలంగాణలో సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుందని, థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామన్నారు.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా కొనసాగడానికి కేంద్ర ప్రభుత్వం విధానాలే కారణమని, వ్యాక్సిన్ ను కొనాల్సిన సమయంలో కొనుగోలు చేయకుండా విదేశాలకు ఎగుమతి చేశారన్నారు. ఇతర దేశాల్లో నిరుపయోగంగా ఉన్న కోవీషిల్డ్ డోసులను భారత్ కు తెప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.