
హైదరాబాద్, నిఘా24: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. శనివారం హైదరాబాద్ కొండాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే హుజురాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాననే ప్రచారాన్ని ఖండించారు. గత పన్నెండేళ్లుగా ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా తాను హుజురాబాద్ లో పోరాటం చేస్తున్నానని, రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేయడం ఖాయమన్నారు. ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే ఉందని, కానీ వాళ్లు విడిపోతే తనమీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తనకు డబ్బులు ఇచ్చిందని ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. టిఆర్ఎస్ లో ఉంటూ మంత్రి పదవులు అనుభవించినప్పుడు ఈటెల రాజేందర్ కు అమరవీరులు, ఆత్మగౌరవం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.