
హైదరాబాద్ : గోపన్ పల్లి లోని ముప్పా అపార్టుమెంటులో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో ఒంటికి నిప్పంటుకొని మృతిచెందింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు… గోపన్ పల్లిలోని ముప్పా అపార్టుమెంట్ లో సాఫ్టు వేర్ ఉద్యోగి కంకణాల సంతోష్ తన భార్య స్రవంతి(31), తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి 2017 అక్టోబరు లో వివాహం జరుగగా, 2సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కాగా స్రవంతి గతంలో తన భర్త, అత్త, మామలు వేధిస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేసింది. 2018 ఆగస్టు లో ఈ విషయంలో 498కేసు నమోదైంది. సోమవారం రాత్రి సైతం భర్త సంతోష్, అత్త తో స్రవంతికి గొడవ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో అర్థరాత్రి ఒంటికి నిప్పంటుకొని, మంటలతో ఉన్న స్రవంతి లిఫ్టులో తాము ఉంటున్న ఈ-బ్లాక్ 3వ అంతస్థు నుంచి వచ్చి పార్కింగ్ సెల్లర్ లో పడిపోయింది. పూర్తిగా కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మంటలతో స్రవంతి 3వ అంతస్థు నుంచి లిఫ్టులో సెల్లర్ వరకు రావడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో భర్తతో విభేదాలు ఉండడం, పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం వంటి విషయాలపై పోలీసులు అరా తీస్తున్నారు. దీనితో పాటు అపార్టుమెంటులో ఉన్న సిసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. చందనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.