
హైదరాబాద్, నిఘా 24 : హైదరాబాదులో హై టెన్షన్ నెలకొంది. స్టాండప్ కమెడియన్ మునవర్ ఫరుఖీ షో జరుగుతున్న హైటెక్ సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మునావర్ షో జరుగుతున్న మాదాపూర్ శిల్పకళా వేదికను పోలీసు బృందాలు చుట్టుముట్టాయి. శిల్పకళా వేదికతో పాటు మాదాపూర్ లో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2వేల మంది సిబ్బందితో సైబరాబాద్ పోలీసులు మునావర్ షోకు బందోబస్తు కల్పిస్తున్నారు. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూత్వ సంస్థల హెచ్చరికలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే హై టెన్షన్ మాదాపూర్ లో నెలకొంది. హిందూ దేవతలను అవమానించిన మునావర్ షో ను నిర్వహించవద్దని హిందూ సంఘాలు హెచ్చరిస్తుండగా, ప్రభుత్వం మాత్రం షో భద్రత కోసం భారీ ఏర్పాట్లు చేపట్టింది.

షో ను అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు కనివిని ఎరుగని బందోబస్తు ఏర్పాటు చేశారు. శిల్పకళావేదికను శనివారం ఉదయమే తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వేదిక మొత్తం అడుగడుగునా తనిఖీ చేశారు. 2వేల సీటింగ్ కెపాసిటీ తో శిల్పకళా వేదికలో షో జరుగుతుండగా అంతే స్థాయిలో పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేపట్టడం విశేషం. దీంతోపాటు షోకు వచ్చే వారిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మునావర్ షోలో పాల్గొనే వారు సెల్ ఫోన్లు తీసుకురావద్దని, కనీసం వాటర్ బాటిళ్లకు సైతం అనుమతి లేదని పోలీసులు కాంక్షలు పెట్టారు