
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పబ్ లు అర్ధరాత్రి వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. సమయ పాలన లేని పబ్ లతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో 12 గంటల వరకు, వారాంతాల్లో 1 గంట వరకు అనుమతి ఉండగా, హైటెక్ సిటీ పరిధిలోని చాలా వరకు పబ్ లు తెల్లవారు జాము వరకు తెరిచే ఉంటున్నాయి. మద్యం మత్తుకు వేదికైన పబ్ లలో అధిక సమయం తెరిచి ఉంచడంతో మద్యం ఎక్కువై పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. హైటెక్ సిటీ పరిధిలోని పబ్ లలో తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద దాడి జరుగడం వివాదాస్పదం అయ్యింది. మద్యం మత్తులో బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే బందువులుగా గుర్తించారు. కాగా ఈ ఘటనపై ఇరువర్గాల నుంచి పోలీసులకు పిర్యాదు అందకపోవడం విశేషం. మరోవైపు గత శనివారం కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో ఉన్న ఓ పబ్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగిన గొడవకు కొనసాగింపే తాజా దాడి అనే ప్రచారం జరుగుతోంది. పబ్ ల మీద పోలీసు నిఘా సైతం తక్కువ కావడంతో తరచు పబ్ లు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి.
