
హైదరాబాద్, నిఘా24 : హైటెక్ సిటీ రహదారులు ఓపెన్ బార్లను తలపిస్తున్నాయి. కరోనా కారణంగా బార్లు, రెస్టారెంట్లు మూసి ఉండడంతో, వైన్ షాపుల నిర్వాహకులు మందుబాబులకు గేట్లు ఎత్తేశారు. ఏకంగా రహదారులపైనే సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాయి. వైన్ షాపుల ముందు పరిస్థితులను చూస్తే మనం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐటీ కారిడార్ లోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. సానిటైజేషన్, వ్యక్తిగత దూరం వంటి కోవిడ్ నిబంధనలు దేవుడెరుగు… శేరిలింగంపల్లి లో ఏ వైన్ షాపు చూసినా షాపులకు ముందున్న రహదారుల మీద దర్జాగా తిష్ట వేసి, మద్యం సేవిస్తున్న మందుబాబులే కనిపిస్తున్నారు. వైన్ షాపుల సిట్టింగ్ లేకపోవడంతో మద్యం దుకాణాల నిర్వాహకులే మంచింగ్ కోసం తినుబండారాలను సైతం అందుబాటులో ఉంచి రహదారుల మీద కూర్చోబెడుతున్నారు. ముఖ్యంగా గోపన్ పల్లిలో ఉన్న ఓ వైన్ షాపు, మియపూర్ లో ఉన్న ఓ వైన్ షాపు, రాయదుర్గంలో ఉన్న మద్యం దుకాణాల ముందు పరిస్థితి ఘోరంగా ఉంది. వైన్ షాపుల కారణంగా స్థానికులు బంబేలెత్తుతున్నారు. వైన్ షాపుల ముందు నుంచి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. వాహనదారుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మహిళల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఎక్సైజ్ పోలీసులకు, పోలీసులకు ఈ విషయం తెలిసినా, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. వైన్ షాపుల నిర్వాహకులతో మిలాకాత్ కారణంగానే పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.