
హైదరాబాద్, నిఘా24 : మణికొండలో హైటెక్ తరహాలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నగదు స్థానంలో ప్రత్యేక కాయిన్స్ తో పేకాట ఆడుతూ, ఓడిన వారు గెలిచిన వారి అకౌంట్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేస్తూ సరికొత్త దందాకు తెరలేపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేయగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇంజినీర్లు, వ్యాపారులు పట్టుబడ్డారు. మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు గురువారం సాయంత్రం మణికొండలో ఓ అపార్ట్మెంట్ మీద దాడి చేసి హైటెక్ పేకాట స్థావరం గుట్టు రట్టు చేశారు. ఈ స్థావరంలో పోలీసుల కాళ్లుగపేందుకు నగదు స్థానంలో ప్రత్యేక కాయిన్స్ అందుబాటులో ఉంచారు. కాయిన్స్ తో ఆట కొనసాగించి, నగదు బదిలీ మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపడుతున్నారు. ఎంపిక చేసిన తేదీల్లో సమాచారం అందజేసుకొని ఈ తతంగం నడిపిస్తున్నారు.

దీనిపై పోలీసులకు తెలియడంతో గురువారం మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేయగా, 13మంది పట్టుబడ్డారు. వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇంజినీర్లు, వ్యాపారులు ఉండడం విశేషం. వీరి వద్ద నుంచి 1కోటి 80లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు 13మందిని అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.