
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలంలో నుంచి టీఎన్జీఓ కాలనీకి చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని వర్సిటీ వర్గాలు అడ్డుకున్నాయి. యూనివర్సిటీ స్థలంలో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అడ్డుకోవడంతో రెవిన్యూ అధికారులు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఉన్న టీఎన్జీఓ కాలనీకి వెళ్లేందుకు వీలుగా సెంట్రల్ వర్శిటీ ప్రహరీ లోపలి నుంచి రోడ్డు నిర్మాణం కోసం చదును చేయడంతో విద్యార్థులు,ఉద్యోగులు అడ్డుకున్నారు. ప్రభుత్వమే దుశ్చర్యకు పాల్పడుతుండడం సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వృక్షాలు తొలగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, విద్యార్థుల రక్షణకు విఘాతం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సంఘటన స్థలికి చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
