
హైదరాబాద్, నిఘా24 : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ముందస్తు ఎన్నికలకు వరుణ దేవుడు బ్రేక్ వేసినట్టు కనిపిస్తుంది. గత పది రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ గ్రేటర్ లో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశమై ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. సదరు సమావేశం అనంతరం గ్రేటర్ లో ఉన్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ టికెట్ ఆశావహులు ఎన్నికల సమాలోచనల్లో మునిగిపోయారు. దీనితో నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. ప్రభుత్వం సైతం గ్రేటర్ లో రెండు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉండగా, రిజర్వేషన్లపై సైతం ప్రకటన వెలువడింది. అధికార పార్టీ అనుకూల వాతావరణం ఉందని ప్రభుత్వం భావించగా, అనుకోని ఉపద్రవంలా వచ్చిన భారీ వర్షాలు ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడవేసినట్టు సమాచారం. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం వరద ముంపుకు గురికావడం, పలు ప్రాంతాలు ఇప్పటికీ కొలుకోకపోవడంతో అధికార పార్టీ జీహెచ్ఏంసీ ఎన్నికలపై ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. అధికార పార్టీ అనుకూల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో జీహెచ్ఏంసీ ఎన్నికలపై మరికొన్ని రోజులు వేచిచూడాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
ప్రజాప్రతినిధులపై పెల్లుబికిన వ్యతిరేకత…
ముంపు ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తిరగబడడం, ప్రజల ఆగ్రహం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రజలు ఎమ్మెల్యేలపై తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కడం, సాక్షాత్తు మంత్రి కేటీఆర్ పర్యటనలో వ్యతిరేక నినాదాలు చేయడం, మిత్రపక్షం ఎంఐఎంకు సైతం పాత నగరంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే ను మహిళలు నిలదీయడం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కాన్వాయ్ మీద దాడి, ప్రజలు వరద ముంపులో ఉంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఉండడం, వ్యక్తి గల్లంతైనా పటాన్ చెరు ఎమ్మెల్యే పట్టనట్టు వ్యవహరించడంపై వంటి సంఘటనలపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఓ అధికార పార్టీ కార్పొరేటర్ మీద తిరగబడిన ప్రజలు దాడికి సైతం దిగిన విషయం తెలిసిందే. ఈ విషయాలు నిశితంగా గమనిస్తున్న అధికార పార్టీ పెద్దలు గ్రేటర్ ఎన్నికలపై పునరాలోచనలో పడ్డారు. దీంతో మరో ఆరు నెలలు వేచిచూసి జీహెచ్ఏంసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.