
శేరిలింగంపల్లి, నిఘా 24 : హైటెక్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జాదారులకు ఫలహారంగా మారుతున్నాయి. గౌలిదొడ్డి సర్వే నెంబర్ 74లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండడంతో ఇక్కడ ఏకంగా ఓ కబ్జా కాలనీ వెలిసింది. ఈ కబ్జాలకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, కొందరు స్థానిక నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలకు రహదారి కోసం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలానికి ఎసరు పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను కూల్చి రహదారి నిర్మాణం చేపడుతున్నారు.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబర్ 74లో ప్రభుత్వ స్థలం ఉంది. గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఈ భూమిపై కొంత కాలంగా కబ్జాదారుల కన్ను ఉంది. గతంలో ఈ భూమిని ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టగా, నాటి రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ అధికారుల అండదండలతో కొన్ని రోజులుగా కబ్జాదారులు ఇక్కడ రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకుల అండదండలతో రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపడుతూ కబ్జా కాలనీని సృష్టించారు. గౌలిదొడ్డికి చెందిన ఓ నాయకుడు పేదల వద్ద డబ్బులు వసూలు చేస్తూ కబ్జా నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాల కోసం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రహారీని కూల్చివేసి రహదారి ఏర్పాటు చేసుకున్నారు.

వాటాలు వేసుకొని..
గౌలిదొడ్డి సర్వే నెంబర్ 74లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు వేసి పంచుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు, గౌలిదొడ్డికి చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన కిందిస్థాయి నాయకుడు, ఓ రెవెన్యూ అధికారి ఈ కబ్జాలో సూత్రదారులనే ప్రచారం స్థానికంగా జరుగుతుంది. ఇక్కడి కబ్జాలలో కొన్నింటిని రెవెన్యూ యంత్రాంగం రెగ్యులరైజ్ చేయగా, టౌన్ ప్లానింగ్ విభాగం ఈ స్థలాలకు నిర్మాణ అనుమతులు మంజూరు చేసింది.

2014కు ముందు ఉన్న నిర్మాణాలకు మంజూరు చేయాల్సిన రెగ్యులరైజేషన్ కొన్ని రోజులు, నెలల ముందు చేపట్టిన నిర్మాణాలకు ఏ విధంగా చేశారనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
