
హైదరాబాద్, నిఘా 24: అది చూసేందుకు కేవలం మట్టి డంపింగ్ మాత్రమే… కానీ లోతుగా పరిశీలిస్తే కానీ అసలు విషయం అవగతం కాదు… నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో రాత్రికి రాత్రి గుట్టల్లా మట్టి కుప్పలు… తిరిగి చూసే సరికి రాత్రికి రాత్రే మట్టి కుప్పలు మొత్తం చదును… దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో మట్టి మొత్తం చదును చేసి సిద్ధం… ఓ మంచి ముహూర్తం చూసుకొని సదరు స్థలం చుట్టూ రేకులు పాతి ఆధీనంలోకి తీసుకునేందుకు పన్నాగం… ఇది గోపన్ పల్లిలో ఓ ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కబ్జాదారులు వేసిన స్కెచ్. ఇందులో మొదటి అంకం విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ స్థలంలో భారీ ఎత్తున మట్టి పోసి చదును చేసిన అక్రమణదారులు, మరో అంకంలో చుట్టూ రేకులు పాతి ఆధీనంలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అడ్డుకునేందుకు సహసించడం లేదు. గోపన్ పల్లిలో చోటుచేసుకుంటున్న ఈ కబ్జా కహానీ వివరాలు ఇలా ఉన్నాయి…

శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబరు 37లో గౌలిదొడ్డి గ్రామానికి ఆనుకొని ప్రభుత్వ స్థలం ఉంది. కాగా ఈ స్థలాన్ని గత కొన్ని ఏళ్లుగా కబ్జాదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా, ఈ సర్వే నెంబర్ 37 లోని కొంత ప్రభుత్వ భూమి ఇప్పటికే కబ్జాకు గురైంది. మిగిలి ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసేందుకు కాచుకు కూర్చున్న కబ్జాదారులకు ఈ సర్వేనెంబర్ కు ఆనుకొని ఉన్న ప్రైవేటు స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టిన బడా నిర్మాణ సంస్థ జతకలిసింది. నిర్మాణ సంస్థతో కలిసి సర్వే నెంబర్ 37లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు కబ్జాదారులు పథకం వేశారు. ఇందులో భాగంగా నిర్మాణ సంస్థ సెల్లార్ తవ్వకంలో భాగంగా వెలువడిన మట్టిని ప్రభుత్వ స్థలంలో డంపింగ్ చేసి చదును చేశారు. రాత్రి వేళల్లో భారీ ఎత్తున టిప్పర్లలో మట్టిని తీసుకువచ్చి ప్రభుత్వ స్థలంలో డంపింగ్ చేసి దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో చదును చేశారు. సదరు స్థలాన్ని కబ్జా చేసేందుకు పథకం ప్రకారం మట్టి డంపింగ్ చేసి చదును చేయడంతో పాటు చదును చేసిన స్థలం చుట్టూ త్వరలో రేకులు ఏర్పాటుచేసి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పథకం సిద్ధం చేశారు.

స్పందించని రెవెన్యూ అధికారులు…
ప్రభుత్వ భూమిలో ఇంత భారీ ఎత్తున అక్రమంగా డంపింగ్ చేస్తూ, భూమిని చదును చేస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. రోజుల తరబడి వందలకొద్దీ టిప్పర్ల ద్వారా భారీ ఎత్తున మట్టిని డంపింగ్ చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. చివరకు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఫిర్యాదుతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూమిలో డంపింగ్, కబ్జా బాగోతంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా రెవెన్యూ అధికారుల అండదండలతోనే కబ్జాదారులు ప్రభుత్వ భూమి ఆక్రమణకు పూనుకున్నారని స్థానికులు వాపోతున్నారు. గోపన్ పల్లికి చెందిన అధికార పార్టీ నాయకుడు అంతా తానై నిర్మాణ సంస్థతో కలిసి ఆక్రమణ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 37లో ప్రభుత్వ స్థలాన్ని రక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
