
శేరిలింగంపల్లి, నిఘా 24: గౌలిదొడ్డి ప్రభుత్వ స్థలం ఆక్రమణపై నిఘా 24 కథనానికి శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు స్పందించారు. గౌలిదొడ్డి సర్వే నెంబర్ 74లో ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుందంటూ నిఘా 24 కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై కదిలిన శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం గురువారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను జెసిబిలతో నేలమట్టం చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబర్ 74లో ప్రభుత్వ స్థలం ఉంది. గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఈ భూమిని కొంతకాలంగా కబ్జాదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు స్థానిక నాయకులు డబ్బులు వసూలు చేస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై ‘గౌలిదొడ్డిలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి’ అంటూ గురువారం కథనం ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు గురువారం మధ్యాహ్నం సర్వే నెంబర్ 74లో కబ్జాలను కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య, జెసిబిల సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని, కబ్జాదారుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
