
శేరిలింగంపల్లి : కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ లో అధికారులు ఎక్కడికక్కడ బిజీగా ఉండగా అక్రమార్కులు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు తెరలేపారు. జనజీవనం మొత్తం స్తంభించడంతో ఇదే అదునుగా కొందరు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లి సర్వే నెంబర్లు 34, 37, 74లలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించడం, అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదునుగా కొందరు అక్రమ కట్టడాలు చేపట్టారు. గోపన్ పల్లి ఎస్టీపి ప్లాంట్ సమీపంలో, గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల వెనుక, కేశవ నగర్ లలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు శనివారం ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

