
సైబరాబాద్ : వరుస భూ తగాదాలతో గోపన్ పల్లి అట్టుడుకుతుంది. ఇళ్ల మీద దాడులు చేసి కూల్చివేస్తుండడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. బుధవారం గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో 15 మంది ఓ కుటుంబం మీద దాడి చేసి ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో ఉన్న సామగ్రిని బయట పడవేసి, గదులను నేలమట్టం చేయడంతో అందులో ఉంటున్న కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. ఎన్ట్ఆర్ నగర్ ప్లాట్ నెంబర్ 20, 21లపై కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది. కోర్టులో కేసు నడుస్తున్న ఈ ప్లాట్ లో ఉన్న గదుల్లో ఉంటున్న కుటుంబం పై బుధవారం ఉదయం కొంతమంది దాడి చేశారు. సదరు ప్లాట్ తమదంటూ అందులో ఉన్న సామగ్రిని బయట పడవేసి గదులను కూల్చివేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా గోపన్ పల్లిలో వరుసగా చోటుచేసుకుంటున్న భూ వివాదాలతో స్థానికంగా కలకలం రేపుతోంది.
