
హైదరాబాద్: వాళ్ళు కనికరిస్తే కుక్కిన పెనులా ఉండాలి… కన్నెర్ర జేస్తే ఖాళీ చేసి వెళ్లిపోవాలి… కాదు, కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే అంతే సంగతులు. అక్రమ కేసులు, రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, దాడులు వంటివి ఎదుర్కొవాలి. ఇది ఎక్కడో రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో కాదు, ప్రపంచ పేరెన్నికగన్న గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని గోపన్ పల్లి పరిస్థితి. పోలీసు బ్రోకర్ల అవతారమెత్తిన భూకబ్జాదారులు, వారికి వెన్నుదన్నుగా ఉంటున్న పోలీసులతో ఇక్కడి అమాయక ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి గా మారింది. గోపన్ పల్లిలో గల ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీల్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీసులను పక్కన పెట్టుకుని ఆక్రమణలకు పాల్పడుతున్నారు. లక్షలు పెట్టి కొన్న స్థలాలు వదులుకోలేక, వీరి వేధింపులు భరించలేక పలువురు భాదితులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారు. గతంలో ఇక్కడి బాధిత మహిళ ఒకరు ఏకంగా రాష్ట్ర డిజిపి కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించింది. కొన్ని రోజుల క్రితం మరో మహిళ పోలీస్ బాస్ వేధింపులు తాళలేక చనిపోయెందుకు సిద్ధమైంది. మంగళవారం మరో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
పోలీసులతో కలిసి…
తాజ్ నగర్ లో ఓ స్థలానికి సంబంధించి మంగళవారం భుకబ్జాదారులు, పోలీసులు కలిసి తాజ్ నగర్ వెళ్లారు. ఓ పోలీసు బ్రోకర్, పాతబస్తీకి చెందిన వ్యక్తి, పోలీసులు కలిసి తాజ్ నగర్లో నవాజ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి కూల్చివేసేందుకు ప్రయత్నం చేశారు. దీనితో నవాజ్ భార్య యస్మిన్ సుల్తానా భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆసుపత్రికి తీసుకు వెళ్లగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా ఉన్నా, పోలీసులు, కొంతమందికి వత్తాసు పలుకుతూ ఆమె ఇంటికి వెళ్లడం, గత పదిహేను రోజులుగా తన భర్తను వేదిస్తుండడంతో భయంతో ఆమె ఆత్మహత్యకు యత్నించిదని సమాచారం. గోపన్ పల్లిలో తరచు ఇటువంటి సంఘటనలు జరుగుతుండడంపై పోలీసు బాస్ లే సమాధానం చెప్పాలి.
