
హైదరాబాద్: గోపన్ పల్లిలో భూ ఆక్రమణదారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన మహిళ కుటుంబ సభ్యులు గురువారం సైబరాబాద్ కమిషనర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గోపన్ పల్లిలో మంగళవారం చోటుచేసుకున్న విషయాలను కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఎండి నవాజ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో గల సర్వే నెంబర్ 124రు లో ఉన్న 18,19 ప్లాట్ లను కొనుగోలు చేసి, కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, కానీ కొన్ని రోజులుగా గుంజి పాల్, జవేద్, శ్రీనివాస్ అనే వ్యక్తులు సదరు ప్లాట్ కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. గచ్చిబౌలి పోలీసులు సైతం వీరితో కలిసి తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. మంగళవారం తమ ప్లాట్ లోకి అక్రమంగా చొరబడి, కూల్చివేతలు చేస్తుండగా, మనస్తాపంతో తన భార్య యస్మిన్ ఆత్మహత్య కు యత్నించిందని తెలిపారు. అక్రమార్కుల నుంచి, వారికి సహకరిస్తున్న గచ్చిబౌలి పోలీసుల నుంచి తమను కాపాడాలని కోరారు. గోపన్ పల్లిలో కబ్జాదారుల ఆగడాలు పెరిగిపోయాయని, గతంలో కన్యగారి లక్ష్మీ అనే మహిళ ఏకంగా డిజిపి కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించిందని అన్నారు. వీరితో పాటు సీపీఐ నాయకులు ఉన్నారు.