
హైదరాబాద్ : ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలో జీహెచ్ఎంసీ కి శేరిలింగంపల్లి సర్కిల్ గుండెకాయ. హైటెక్ సర్కిల్ గా పేరుగాంచిన శేరిలింగంపల్లి సర్కిల్ ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు ఇక్కడ ఉండడంతో ఆస్తి పన్ను వసూళ్లలో ప్రతిసారి శేరిలింగంపల్లి సర్కిల్ టాప్ లో ఉంటుంది. పన్నుల వసులుతో పాటు, పన్ను విధించే టాక్స్ ఇనిస్పెక్టర్ లకు సైతం ఈ సర్కిల్ ఓ బంగరు బాతు. ఇక్కడ పనిచేసేందుకు టాక్స్ఇనిస్పెక్టర్ లు పైరవీలు చేసి పోస్టులు పొందుతారనే విషయం బహిరంగ రహస్యం. ఇక ఉన్నతాధికారుల అండదండలు ఉంటే ఇక్కడ పనిచేసే టాక్స్ ఇనిస్పెక్టర్ లకు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇదే అండదండలతో ఓ టాక్స్ఇనిస్పెక్టర్ గత కొన్ని సంవత్సరాలుగా సర్కిల్ లో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్నాడు. తనతో పాటు పని చేసిన వారు ఎంతమంది మారిపోయినా ఇతను మాత్రం ఇక్కడే ఉంటూ జీహెచ్ఎంసి శేరిలింగంపల్లి రెవెన్యూ విభాగంలో సూడో బాస్ గా మారిపోయాడు. ఈ విభాగం సిబ్బందికి మొత్తం ఇతనో అనధికార బాస్ గా చలామణి అవుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా ఇతను సైతం మరో ప్రాంతానికి బదిలీ అయ్యాడు. కానీ పైరవీలు చేసి10 రోజుల్లోనే తిరిగి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయనికి బదిలీ చేయించుకున్నాడు. పేరుకు జోనల్ కార్యాలయంలో ఉద్యోగమైనా, ఈ అధికారి డ్యూటీ చేసేది మాత్రం సర్కిల్ కార్యాలయంలోనే. బదిలీ తరువాత సర్కిల్ లో తన స్థానంలో మరో టాక్స్ఇనిస్పెక్టర్ భాద్యతలు తీసుకోకుండా జాగ్రత్త పడి, ప్రస్తుతం పాత ఏరియాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారుల అండదండలతో ఈ విభాగానికే సూడో బాస్ గా వెలుగొందుతున్నాడు.
నిబంధనలకు పాతర – జేబులు నింపుకునే జాతర …
గతంలో 1000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన ఈ అధికారి అనంతరం శేరిలింగంపల్లిలో పోస్టింగ్ వేయించుకోని ఇక్కడే సెట్టిల్ అయ్యాడు. అక్రమ మ్యుటేషన్లు, అస్సెస్మెంట్లలో తన చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమ సంపాదనే ద్యేయంగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా గోపన్ పల్లి సర్వే నెంబర్ 124లో గల వివాదాస్పద ఎన్టీఆర్ నగర్ లో వెలిసిన ఇళ్లకు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లు కేటాయిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో నెంబర్ కోసం 2నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నాడని బోగట్టా.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీఓ 299 కింద ఇక్కడి ఇళ్లకు నంబర్లు కేటాయించాలని ఉన్నా, నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మార్గంలో నంబర్లు కేటాయిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో విచారణ చేపట్టాలని, అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

9 Comments