
హైదరాబాద్, నిఘా24: జీహెచ్ఏంసీలో శేరిలింగంపల్లి సర్కిల్ రెవెన్యూ విభాగం వెరీ వెరీ స్పెషల్. గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న సర్కిల్ శేరిలింగంపల్లి. ఇక్కడ ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, షాపింగ్ మాల్స్, వ్యాపార కార్యాలయాల కారణంగా భారీ ఎత్తున టాక్సులు వసూలు అవుతున్నాయి. వీటికి తోడు కమర్షియల్ భవనాలు, హాస్టళ్లు, హోటళ్లు వంటి వాటితో సర్కిల్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. సర్కిల్ రెవెన్యూ విభాగం టాక్సులు వసూలులో క్షేత్రస్థాయిలో టాక్స్ ఇనిస్పెక్టర్, బిల్ కలెక్టర్ల ది ప్రధాన పాత్ర. ప్రభుత్వ ఆదాయం ఎక్కువగా ఉన్నచోట అడ్డదారిలో జేబులు నింపుకునే మార్గాలు ఎక్కువగానే ఉంటాయి. ఇదే ఇక్కడ ప్రత్యేకత… ఇక్కడ పోస్టింగ్ కోసం పైరవీలు భారీ ఎత్తున నడుస్తాయనే నానుడి ఉండగా, శేరిలింగంపల్లి సర్కిల్ లో పోస్టింగ్ లభిస్తే పంట పండినట్టే అని భావిస్తుంటారు. గతంలో ఈ కార్యాలయంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన వైనాలు, పలు పార్టీలు, వివాదాలు ఇక్కడ అవినీతిని కళ్లకు కడుతున్నాయి. గత అనుభవాలతో ఇక్కడి అధికారులు కొత్తదారులు వెతుకున్నారు. అదే ప్రైవేట్ సేవకులు. వీరు ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం కాదు, కనీసం ఔట్ సోర్సింగ్ కార్మికులు కూడా కాదు. కానీ శేరిలింగంపల్లి సర్కిల్ రెవెన్యూ విభాగంలో వీరు చెప్పిందే వేదం. ఏకంగా కార్యాలయంలో తిష్టవేసి, దర్జాగా అధికారుల సీట్లలో కూర్చుంటున్నారు. కార్యాలయంలో ఫైలు కదలాలన్నా, పని జరగాలన్నా వీరి అనుగ్రహం కావలసిందే. సర్కిల్ లో ఉన్న 8డాకేట్ ఏరియాలో దాదాపు 20మంది ప్రైవేట్ సేవకులు పనిచేస్తున్నారు. కొందరు అధికారులు వారి చేతికి మట్టి అంటకుండా ఈ ప్రైవేట్ సైన్యం ద్వారా వసూళ్లు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఈ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు, దండుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వీరి కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, పనుల కోసం వచ్చిన ప్రజలు నెలల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సీ వస్తుంది. ఒక్కో అధికారి వద్ద దాదాపు ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తుండగా, వీరి ఒక్కరికి ఇరవైవేల జీతంతో పాటు ఖర్చులు మొత్తం సదరు అధికారే చూసుకుంటుండడం ఇక్కడి అవినీతికి అద్దం పడుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, జీహెచ్ఏంసీ ప్రతిష్ట మంటగలుపుతూ, జేబులు నింపుకోవడం పైనే దృష్టి పెడుతూ, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ సేవకులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సీన అవసరం ఉంది.
