
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసి పరిధిలోని అక్రమ నిర్మాణాలకు బుధవారం నుంచి ఈ-నోటీసులు జారీ చేయనున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి ఆన్ లైన్ ద్వారా నోటీసులు జారీ చేస్తారు. అక్రమ నిర్మాణానికి 452(1) కింద మొదటి నోటీస్, 7రోజుల తరువాత 452(2) కింద రెండవ నోటీస్, 3 రోజుల తరువాత 636 కింద చివరి నోటీస్ ఆన్ లైన్ ద్వారానే ఇవ్వనున్నారు. మొదటి నోటీస్ నుంచి చివరి నోటీస్ వరకు సిబ్బంది ప్రమేయం లేకుండా, జాప్యం జరుగకుండా నోటీసులు జారీ కానున్నాయి. ప్రతి నోటీసు సమయంలో అక్రమ నిర్మాణం ఫోటోను సిబ్బంది సిస్టంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తుది నోటీసు తర్వాత 24 గంటల్లో అక్రమ నిర్మాణం పూర్తి స్థాయిలో కూల్చివేసిన ఫోటోలను అప్లోడ్ చేయనున్నారు.
శేరిలింగంపల్లి నుంచే…
కాగా అక్రమ నిర్మాణాలపై భారీ ఎత్తున చర్యలు తీసుకోవడం, ఈ- నోటీసుల జారీని శేరిలింగంపల్లి నుంచే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ లో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతుండడంతో జోనల్ కమిషనర్ శేరిలింగంపల్లి నుంచి కొత్త నిబంధనను ప్రారంభించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. మూడు నోటీసులు జారీ చేసిన అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూల్చివేయనున్నారు.
2 Comments