
హైదరాబాద్, నిఘా24: బల్దియా ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం150 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషనతో మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించేందుకు అనుమతిచ్చింది. ఈ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 74.04 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 9 వేల పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషనతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. రాష్ట్ర రాజధానీలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ- డిసెంబర్ 1
నామినేషన్ల స్వీకరణ – నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు
నామినేషన్ల పరిశీలన – నవంబర్ 21
నామినేషన్ల ఉపసంహరణ – నవంబర్ 22
ఫలితాలు- డిసెంబరు 4న