
శేరిలింగంపల్లి, నిఘా24: జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఉన్న మూడు డివిజన్ల ఎన్నికల కౌంటింగ్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్ ల కౌంటింగ్ ను గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి డివిజన్ కౌంటింగ్ ను 14 టేబుల్ ద్వారా, కేవలం 2 రౌండ్ల లో పూర్తి చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకే మూడు డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదటగా కొండాపూర్ డివిజన్ ఫలితం, తరువాత గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ఫలితాలు రానున్నాయి. కౌంటింగ్ సందర్భంగా అధికారులు కఠిన నిబంధనలు విధించారు. అనుమతి ఉన్నవారికే స్టేడియం లోపలికి అనుమతి ఉందని, కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ల అనుమతి లేదని తెలిపారు.