
శేరిలింగంపల్లి, నిఘా24: జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ లో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉంచిన ఇంటి నెంబర్ల ఫైళ్లు రాత్రికి రాత్రే క్లియరెన్స్ అవుతున్నాయి. జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ మాదిరిగానే రెవెన్యూ సెక్షన్ సైతం ఆన్ లైన్ చేసి, ఇంటి నంబర్లను ప్రధాన కార్యాలయం నుంచి మంజూరు చేయనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటి వరకు స్థానిక సర్కిల్ అధికారులు మంజూరు చేస్తున్న పిటిఐఎన్ నెంబర్ విధానాన్ని మార్చి, నేరుగా ప్రధాన కార్యాలయం నుంచే ఆన్ లైన్ లో ఇంటి నంబర్లు మంజూరు కానున్నాయి. కాగా ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో మంజూరు చేస్తున్న ఇంటి నంబర్ల మాన్యువల్ లైన్ రేపటి (గురువారం) నుంచి జిహెచ్ఎంసి నిలిపివేస్తున్నట్లు శేరిలింగంపల్లి సర్కిల్ లో పొక్కింది.
దీంతో ఇప్పటికే వినియోగదారులు దరఖాస్తు చేసుకున్న ఇంటి నెంబర్ల ఫైళ్ళను పలు కారణాలతో నెలలకొద్ది పెండింగ్ లో పెట్టిన సర్కిల్ సిబ్బంది ఆదరాబాదరాగా, రాత్రికి రాత్రే క్లియరెన్స్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం నుండి జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఈ విధంగా వందల కొద్ది ఫైళ్ళను క్లియరెన్స్ చేస్తున్నారు. కాగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సంతకం లేకుండానే ఆన్ లైన్ పిటిఐఎన్ నెంబర్లను కేటాయిస్తూ, ఇంటి నెంబర్లను జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రాత్రికి రాత్రే భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.