
శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్-20 రెవెన్యూ విభాగంలో అంతర్గత బదిలీల పరంపర కొనసాగుతుంది. సర్కిల్ రెవెన్యూ విభాగంలో గత నెలలోనే బదిలీలు జరుగగా, తాజాగా పలువురు అధికారులు, సిబ్బందికి స్థాన చలనం కల్పించారు. ఈ మేరకు సర్కిల్-20 డిప్యూటీ కమిషనర్ వెంకన్న బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, టాక్స్ ఇనిస్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లకు స్థాన చలనం కల్పించారు. తాజా జాబితాలో గత నెలలో ఏరియా మారిన వారు సైతం ఉండడం విశేషం. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించక ముందే మరోసారి ప్రాంతాలు మారడం చర్చనీయాంశంగా మారింది. టిఐలు సంజయ్, రామకృష్ణరెడ్డి, గిరి, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ రెడ్డి, బిల్ కలెక్టర్ నరేందర్, విద్యా సాగర్, నరేందర్ రెడ్డి, రాము, సుదర్శన్, కృష్ణలు వారు పనిచేస్తున్న డాకెట్ నుంచి మరో డాకెట్ కు బదిలీ అయ్యారు.