
శేరిలింగంపల్లి, నిఘా24: ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకువస్తారని గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు కనిపించని నాయకులు, ఇప్పుడు వచ్చి తమను విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్, కేశవనగర్ లలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ గత ఐదేళ్ళుగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా, రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్ గా పనిచేసిన తమను ప్రతిపక్ష నాయకులు విమర్శించడం హేయమన్నారు.

కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలిచింది టిఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులేనని తెలిపారు. గచ్చిబౌలిలో ప్రభుత్వ సహాయంతో పాటు తన సొంత నిధులతో 25000 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. దీంతోపాటు భారీ వర్షాల సమయంలో వరద సహాయక చర్యల్లో టిఆర్ఎస్ పార్టీనే ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు అప్పుడు కనిపించకుండా పోయి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని బయటకు వచ్చి తమ మీద విమర్శలు చేస్తున్నారని, ప్రజలు ఇది గమనిస్తున్నారన్నారు. వరద బాధితులకు పదివేల ఆర్థిక సహాయం అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తాము ఎల్లప్పుడూ ముందు ఉన్నామని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా తాము చేసిన అభివృద్ధిని గచ్చిబౌలి ప్రజలు గుర్తించారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గచ్చిబౌలిలో టిఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమన్నారు.
