
శేరిలింగంపల్లి, నిఘా24: గత అయిదేళ్ల కాలంలో గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి పనులు చేపట్టామని గచ్చిబౌలి డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా పేర్కొన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం గచ్చిబౌలి పరిస్థితిని… నేడు ఉన్న పరిస్థితిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. గతంలో వేసవి వచ్చిందంటే మంచినీటి, విద్యుత్ కటకట ఉండేదని, కానీ నేడు మంచినీటి కోసం అగచాట్లు, విద్యుత్ కోసం ఆందోళనలు లేవన్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు ఎంతో సహకరించారని, వారికి డివిజన్ మీద ప్రత్యేక దృష్టి ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను కార్పొరేటర్ గా మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
