
శేరిలింగంపల్లి, నిఘా24: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతుందని గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతతో, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంకల్పంతో నేడు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు గచ్చిబౌలి ఐటీ కారిడార్ కు వరుస కట్టాయని, గచ్చిబౌలి ప్రాంతం ఉద్యోగాల కేంద్రంగా మారిందని తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సాయిబాబా మంగళవారం పర్యటించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన సాయిబాబా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా అభ్యర్థి సాయిబాబా మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్లో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వం లింకురోడ్ల నిర్మాణంతో దశాబ్దాల ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పలికిందన్నారు. గచ్చిబౌలి డివిజన్ అంటేనే మినీ ఇండియా అని,ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా గత ఐదేళ్ళ కాలంలో మౌలిక వసతులను మెరుగుపరిచానని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో కార్పొరేటర్ గా తన పని తీరును గమనించాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
