
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ముస్లిం బస్తీలో డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బస్తీ లో పాదయాత్ర నిర్వహించిన సాయిబాబా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ తన ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో స్థానిక యువకులు భారీగా సాయిబాబా వెంట తరలివచ్చారు. ఈ సందర్బంగా సాయిబాబా మాట్లాడుతూ గత ఐదేళ్లలో గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకువెళ్లినట్టు తెలిపారు.

కోట్లాది రూపాయల నిధులతో డివిజన్ లో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా రాయదుర్గంలో గత ఐదేళ్ళకు ముందు ఉన్న మంచినీటి పరిస్థితిని, రహదారుల పరిస్థితిని, డ్రైనేజీ వ్యవస్థను బేరీజు వేసుకోవాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ అభివృద్ధి లో భాగస్వామ్యం చేశామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయం అనే తమ నాయకుడు కెటిఆర్ సిద్ధాంతంతో పనిచేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
