
హైదరాబాద్, నిఘా24: ‘తగ్గేదేలే’… ఈ డైలాగ్ ఈ మధ్య తెగ పాపులర్ అయ్యింది. ఈ డైలాగ్ తో జోష్ తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వ అధికారులు తగ్గేదేలే అంటూ పోటీపడుతున్నారు. విధులు నిర్వహించడంలోనో, ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనో కాదండి ఈ పోటీ… అక్రమ నిర్మాణాలు నిర్మించడంలో పోటీ పడుతున్నారు… ఒకరు నాలుగంటే, మరొకరు ఐదు… ఇంకొకరు ఆరు అంతస్థులంటూ అక్రమ నిర్మాణాల్లో పోటీపడుతున్నారు. అడ్డుకోవాలసిన టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం తమ తోటి అధికారుల అక్రమ నిర్మాణాలకు అండదండగా నిలుస్తుండటంతో గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ అక్రమ నిర్మాణాల పుట్టగా మారింది…

ప్రభుత్వ బాధ్యతల్లో ఉండి, ప్రజలు తప్పు చేయకుండా చూడాల్సిన అధికారులే అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల్లో అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నారు. సామాన్యుడు అనుమతికి మించి ఒక్క అంతస్థు ఎక్కువ నిర్మించినా కూల్చివేసే ప్రభుత్వం, గచ్చిబౌలి టిఎన్జీఓ కాలనీలో భాద్యతాయుతమైన ప్రభుత్వ ఉన్నతాధికారులే అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ఐటీ కారిడార్ మధ్యలో ఉన్న టిఎన్జీఓ కాలనీలో వందల కొద్ది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. టిఎన్జీఓ కాలనీలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అధికారులే అక్రమ నిర్మాణాలకు పాల్పడడం శోచనీయం. అసలు అనుమతే తీసుకోకుండా బహుళ అంతస్థుల నిర్మాణం చేపట్టినా, కేవలం 182గజాల స్థలంలో ఏకంగా 6 అంతస్థుల భవంతులు వెలుస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల్లో బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయాలు కొలువుదీరినా… చర్యలు తీసుకోవడం దేవుడెరుగు, కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ మధ్యలో టిఎన్జీఓ కాలనీ ఉండడంతో ఈ కాలనీలో నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇక్కడ నిర్మాణం చేపడుతున్న నిర్మాణాల్లో చాలా వరకు అక్రమ నిర్మాణాలే. అసలు అనుమతులే లేకుండా కొన్ని నిర్మాణాలు జరుగుతుండగా, కేవలం 2 అంతస్థుల అనుమతితో ఏకంగా 6 అంతస్థుల నిర్మాణం చేపడుతున్నవి కొన్ని. వీటితో పాటు రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ భవనాలు నిర్మిస్తున్నారు. సామాన్యుడు అనుమతికి మించి ఒక్క పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టినా కూల్చివేతలతో హడావుడి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు టిఎన్జీఓ కాలనీలో వందల కొద్దీ అనుమతి లేని నిర్మాణాలు కొనసాగుతున్నా కళ్లు మూసుకుంటున్నారు. అసలు టిఎన్జీఓ కాలనీని గమనిస్తే ఈ కాలనీ నగరంలోనే ఉందా లేక ఇక్కడి వారికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక అనుమతులు ఇచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. ఒకరిని మించి ఒకరు కేవలం 182 గజాల స్థలంలో 6 అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. కాలనీలో వేలల్లో ఉన్న భవనాల్లో సక్రమంగా ఉన్నవి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు అంటే అతిశయోక్తి కాదు. ఈ నిర్మాణాలను చూసిన ప్రజలు ప్రభుత్వ అధికారులకు ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.