
హైదరాబాద్, నిఘా24: శవం మీద పేలాలు ఏరుకున్న సామెతను ఈ దంపతులు నిజం చేశారు. కరోనాతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందిన వారి శరీరాలపై ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేయడం పనిగా పెట్టుకున్నారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో రోగులకు సహాయపడే పవిత్ర వృత్తిలో చేరిన దంపతులు చనిపోయిన రోగుల, వ్యాధితో అపస్మారక స్థితిలో ఉన్న రోగుల ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. గత రెండు నెలలుగా టిమ్స్ ఆసుపత్రిలో ఈ విధంగా చోరీలకు పాల్పడుతున్న చొర దంపతులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లికి చెందిన చింతపల్లి రాజు(36), చింతపల్లి లతశ్రీ(39) దంపతులు గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన వారి శరీరాలపై ఆభరణాలను తస్కరించసాగారు. దొంగిలించిన సొత్తును తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేయసాగారు. మృతుల బంధువుల నుంచి గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో 7 కేసులు నమోదు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు భార్య, భర్తలను అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి 10 లక్షల విలువచేసే బంగారు,వెండి అభారలు,మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
