
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో ఉన్న స్పోర్ట్స్ విలేజ్ భవనం ప్రతిష్టాత్మక తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) ఆసుపత్రిగా మారింది. తెలంగాణలొనే ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రిలో 750 సాదారణ, 750 మల్టిస్పెషలిటీ పడకలు అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు 50 ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసియూ) పడకలను సిద్ధం చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ భవనంతో పాటు దాని చుట్టూ ఉన్న 9.16 ఎకరాల భూమిని టిమ్స్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఈ ఆసుపత్రిని మరింత విస్తరించడం కోసం ప్రయత్నిస్తామని ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం 14 అంతస్థుల ఈ భవనాన్ని 2007వ సంవత్సరంలో ప్రపంచ మిలటరీ గేమ్స్ సందర్భంగా 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రతి అంతస్థులో 36 గదులతో మొత్తం 468 గదులు ఈ భవనంలో ఉన్నాయి. అత్యాధునిక సదుపాయాలతో సిద్ధం చేసిన ఈ టిమ్స్ ఆసుపత్రి ప్రస్తుతానికి కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రిగా సేవలు అందించనుంది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత సాధారణ వైద్య సేవలు ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. టిమ్స్ ఏర్పాటుతో సైబరాబాద్, ఐటీ కారిడార్, చుట్టూ ప్రక్కల ప్రాంతాల ప్రజలకు ఓ ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది.