
హైదరాబాద్, నిఘా24: తలసేమియా బాధితుల సహాయార్థం గచ్చిబౌలి పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. సైబరాబాద్ కమిషనర్ విసి.సజ్జనార్ ఆదేశాల మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పర్యవేక్షించడంతో పాటు రక్తదానం చేసిన దాతలను ప్రశంసించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరం ద్వారా మొత్తం 102 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ సందర్భంగా డిసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్తదానం ప్రాణ దానంతో సమానమని, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణం పోసిన వారవుతారని అన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో పోరాడుతున్న వారికి రక్తం క్రమం తప్పకుండా అవసరమవుతుందని, వారి ఇబ్బందులను గుర్తించిన సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రక్తదాన శిబిరాల ఏర్పాటు కోసం సూచించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని డి సి పి అభినందించారు. కార్యక్రమంలో మాదాపూర్ ఏసిపి రఘునందన్, గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గోన సురేష్, ట్రాఫిక్ ఇనిస్పెక్టర్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.