
హైదరాబాద్, నిఘా24: గచ్చిబౌలిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పెళ్లి బరాత్ లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బరాత్ కోసం బ్యాండ్ బృందంతో వచ్చిన బ్యాండ్ యజమాని మృతి వివాదాస్పదంగా మారింది. అనారోగ్య కారణాలతోనే మృతిచెందాడని పోలీసులు పేర్కొంటుండగా, పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలి పిజెఆర్ నగర్ లో శుక్రవారం రాత్రి పెళ్లి బరాత్ నిర్వహించారు. సికింద్రాబాద్ కు చెందిన సరస్వతి బ్యాండ్ ను పిలిపించగా, సిబ్బందితో కలిసి బ్యాండ్ యజమాని గడిగె నరేష్ గచ్చిబౌలికి వచ్చాడు. శుక్రవారం రాత్రి బరాత్ ప్రారంభం కాగా, రాత్రి 11:30 ప్రాంతంలో స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి వచ్చిన రాయదుర్గం పోలీసులు బరాత్ ను నిలిపి వేయించారు. ఇదే సమయంలో బ్యాండ్ యజమాని నరేష్ మృతి చెందడం వివాదాస్పదంగా మారింది.
అనారోగ్యంతోనే మృతి: డీసీపీ
తమకు డయల్ 100 ద్వారా రెండుసార్లు బరాత్ మీద ఫిర్యాదులు వచ్చాయని, మొదటిసారి బరాత్ ను నిలిపి వేయించి పెళ్లి పోయిన పోలీసులు, మరోసారి ఫిర్యాదు రావడంతో సంఘటనా స్థలికి వెళ్లడం జరిగిందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండవసారి పోలీసులను చూసి వెళ్ళిపోయే క్రమంలో డీజే వాహనం టిప్పర్ ను ఢీకొట్టడంతో బ్యాండ్ సిబ్బందికి గాయాలయ్యాయని, దీన్ని చూసిన యజమాని నరేష్ ఒక్కసారిగా టెన్షన్ తో కింద పడ్డాడన్నారు. కిండపడే సమయంలో ఇనుప చువ్వ తలకు గుచ్చుకోవడం, టెన్షన్లో గుండెపోటు రావడంతో నరేష్ మృతిచెందాడని డిసిపి పేర్కొన్నారు.

పోలీసులు కొట్టడంతోనే: మృతుడి కుటుంబ సభ్యులు
కాగా పోలీసులు కొట్టడం తోనే బ్యాండ్ యజమాని నరేష్ మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు బరాత్ ను నిలిపివేయాలంటూ సిబ్బందిని కొట్టడం, యజమాని నరేష్ ను నెట్టి వేయడంతో కింద పడిన నరేష్ తలకు గాయమై మృతిచెందాడని వాపోతున్నారు. తెలుగు రాని బ్యాండ్ సిబ్బందితో తెలుగులో పిర్యాదు రాయించుకొని కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ…
కాగా ఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్యాండ్ యజమాని నరేష్ గుండెపోటుతో మృతిచెందాడని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా అంచనా వేస్తున్నామన్నారు. మరిన్ని మెడికల్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఘటనపై మాదాపూర్ ఏసిపీ ఆధ్వర్యంలో విచారణ చేపడతామని, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
