
శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా తన ప్రచారాన్ని ఉదృతం చేశారు. ఆదివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. దీంతోపాటు గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఐదేళ్ల క్రితం గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీలు ఏ విధంగా ఉన్నాయో, ప్రస్తుతం సదరు కాలనీల్లో మౌలిక వసతులు ఎంత అభివృద్ధి చెందాయో ప్రజలు గమనించాలని అన్నారు.

‘ఎన్నికల సమయంలోనే రాజకీయాలు… సాధారణ సమయంలో అభివృద్ధిపై దృష్టి’ అనే తమ మంత్రి కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా గత ఐదేళ్లుగా పని చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయి గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా గత ఐదేళ్లుగా కార్పొరేటర్గా అభివృద్ధిపైనే దృష్టి సారించానని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు చేరే విధంగా కృషి చేశామన్నారు. గచ్చిబౌలి డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రాజునాయక్, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
