
శేరిలింగంపల్లి, నిఘా24: గత ఐదేళ్లుగా గచ్చిబౌలి డివిజన్ లో జరిగిన అభివృద్ధిని చూసి డిసెంబర్ 1వ తేదీన ఓటు వేయాలని గచ్చిబౌలి డివిజన్ ప్రజలను టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, సిట్టింగ్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం చివరిరోజు ఆదివారం డివిజన్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు కాలనీలు, బస్తీలలో రోడ్ షోల ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ గత అయిదేళ్లలో కార్పొరేటర్ గా ఎటువంటి అవినీతి, ఆరోపణలు, బంధుప్రీతి లేకుండా పని చేశానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు చేర వేశానని తెలిపారు. డివిజన్ లో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

గచ్చిబౌలి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆరోగ్య కేంద్రాన్ని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీ దేనని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మధురానగర్ లో పక్కా భవనాన్ని నిర్మించి, అందుబాటులోకి తీసుకురావడం, మినీ ఫంక్షన్ హాళ్లు, స్మశాన వాటికల అభివృద్ధి చేపట్టామన్నారు. దీంతోపాటు ప్రజల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మంచినీరు, డ్రైనేజీ, రహదారులను పూర్తిస్థాయిలో ఆధునీకరించామని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ ప్రజలు మరోసారి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు.
