
గచ్చిబౌలి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గత సంవత్సర కాలంగా దాదాపు 23 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులను 80శాతం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా గత సంవత్సర కాలంగా డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తాను కార్పొరేటర్ గా ఎన్నికై సంవత్సరం పూర్తయిందని, ఏడాది కాలంగా కనీస వసతులైన మంచినీరు, డ్రైనేజీ, రహదారుల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సాధించామని తెలిపారు. ఏడాది కాలంలో 23 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో 80 శాతం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల సమయంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించానన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ప్రస్తుతం రాజకీయాలకతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ ను గచ్చిబౌలి డివిజన్ లో విజయవంతంగా చేపట్టామని, మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా ప్రజలకు వ్యాక్సిన్ ను అందించామని తెలిపారు. రాబోయే రోజుల్లో చెరువుల సుందరీకరణ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, ఇందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేస్తామన్నారు. తనను కార్పొరేటర్ గా ఎన్నుకున్న గచ్చిబౌలి డివిజన్ ప్రజలకు, అవకాశం కల్పించిన బిజెపి నాయకత్వానికి, వెన్నుదన్నుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.