
శేరిలింగంపల్లి, నిఘా 24: గచ్చిబౌలి డివిజన్ ప్రజలు ఎంతో నమ్మకంతో తనను కార్పొరేటర్ గా గెలిపించుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత రెండేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం గౌలిదొడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై గంగాధర్ రెడ్డిని అభినందించారు.
అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో డివిజన్ పరిధిలో 35 కోట్లతో చేపట్టిన పనులను పూర్తి చేయడం జరిగిందని, మరో 40 కోట్లతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయన్నారు.

అంతర్గత రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తూ డివిజన్ మొత్తం భారీ నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. డ్రైనేజీ పైప్ లైన్ పనులను శరవేగంగా చేపడుతున్నామని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారు. వీటితో పాటు కోట్లాది రూపాయల నిధులతో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని, డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఓపెన్ ఎయిర్ జిమ్ లు ఏర్పాటు చేశామన్నారు. చెరువుల సుందరీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, తాను సైతం గోపన్ పల్లి మెడ్లకుంట చెరువును దత్తత తీసుకుని ప్రైవేట్ సంస్థ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఖాజాగుడ మినీ స్టేడియంను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని, నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్లను సద్వినియోగం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, నాయకులు హనుమంతు నాయక్, వరలక్ష్మి ధీరజ్, విట్టల్, శివ సింగ్, తిరుపతి దయాకర్, కిషన్ గౌలి, చిలుకూరి మహేశ్వరి, ఇందిరా, సుజాత, శ్రీరాములు, కృష్ణ యాదవ్, సంజీవ్, సుబ్రమణ్యం, అరుణ్ గౌడ్, రంగస్వామి ముదిరాజ్, ముర్గ, విష్ణు, నగేష్ దుర్గరామ్, వెంకటేష్, సురేష్, సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.