
హైదరాబాద్, నిఘా24: “నాడు వారి సేవలకు గుర్తింపుగా చప్పట్లు కొట్టి… పూలు జల్లిన ప్రభుత్వాలు, నేడు చేసిన పనికి జీతం అడిగితే ఆఫ్టరాల్ కాంట్రాక్టు ఉద్యోగులు… ఎక్కువ మాట్లాడితే ఉద్యోగంలోంచి తెసేస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు.” కరోనా రోగులకు సేవలందించాల్సిన నర్సులు జీతంకోసం రోడ్డెక్కారు. గత ఐదు, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, క్వారంటైన్స్ సెలవులను ఇవ్వాలని, ఆసుపత్రి ఉన్నతాధికారులు వేధింపుల నుండి తమను విముక్తి చేయాలని కోరుతూ గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 200 మంది కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో తమను కాంట్రాక్ట్ పద్దతిలో టిమ్స్ ఆసుపత్రిలో చేర్చుకున్నారని, జాబ్లో జాయిన్ అయ్యే టైంలో రూ. 25,140 జీతం ఇస్తామని చెప్పి, గత నాలుగు, ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. జీతాలు ఎప్పుడు వస్తాయని అడిగితే జీవో ఇంకా రాలేదు అంటూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సెంటీవ్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఒక వారం డ్యూటీ చేస్తే మరో వారం క్వారంటైన్ సెలవు ఉండేదని, ప్రస్తుతం క్వారంటైన్ సెలవులు రద్దు అయ్యాయని, ఇప్పుడు ప్రతి రోజు డ్యూటీకి రావాలంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డీఎంఈ అధికారిని కలిస్తే అఫ్ట్రాల్ మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ నన్నే ప్రశ్నిస్తారా అంటూ మాట్లాడారని ఆవేధన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ దృష్టికి తీసుకువెళ్తే వేధింపులకు గురిచేస్తున్నాడని, ఉద్యోగం నుండి తీసేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. ఇప్పటికైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
