

గచ్చిబౌలి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని గుర్తించారని, ఎన్నికల ప్రచారంలో స్థానికులు తనకు బ్రహ్మరథం పడుతున్నారని గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో తన ఎన్నికల ప్రచారాన్ని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాయిబాబా ఉద్ధృతంగా నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ, గచ్చిబౌలి ఎన్నికల ఇంచార్జ్ కడియం శ్రీహరితో కలిసి సోమవారం డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తాండ, నల్లగండ్ల ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకొని జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అభ్యర్థి సాయిబాబా మాట్లాడుతూ గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ లపై నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలన్నారు. గత ఐదేళ్లుగా తనకు సాధ్యమైన హామీలనే ప్రజలకు ఇచ్చానని, ఇచ్చిన హామీలను నెరవేర్చానని తెలిపారు. ఎటువంటి వివాదాలకు, పక్షపాతానికి తావులేకుండా కార్పొరేటర్గా పని చేశానని పేర్కొన్నారు. మరోసారి డివిజన్ ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని, గచ్చిబౌలి డివిజన్ అంటే టిఆర్ఎస్ పార్టీ కంచుకోట అని నిరూపించాలని పిలుపునిచ్చారు.