
హైదరాబాద్, నిఘా24: ప్రభుత్వ బాధ్యతల్లో ఉండి, ప్రజలు తప్పు చేయకుండా చూడాల్సిన అధికారులే అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల్లో అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నారు. సామాన్యుడు అనుమతికి మించి ఒక్క అంతస్థు ఎక్కువ నిర్మించినా కూల్చివేసే ప్రభుత్వం, గచ్చిబౌలి టిఎన్జీఓ కాలనీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినా పట్టించుకోవడం లేదు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ఐటీ కారిడార్ మధ్యలో ఉన్న టిఎన్జీఓ కాలనీలో వందల కొద్ది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఏ అధికారి కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ అధికారులే అక్రమ నిర్మాణాలకు పాల్పడడం శోచనీయం. అసలు అనుమతే తెలుకోకుండా బహుళ అంతస్థుల నిర్మాణం చేపట్టినా, కేవలం 180గజాల స్థలంలో ఏకంగా 5 అంతస్థుల భవంతులు వెలుస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాల్లో బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయాలు కొలువుదీరినా… చర్యలు తీసుకోవడం దేవుడెరుగు, కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్ మధ్యలో టిఎన్జీఓ కాలనీ ఉండడంతో ఈ కాలనీలో నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇక్కడ నిర్మాణం చేపడుతున్న నిర్మాణాల్లో చాలా వరకు అక్రమ నిర్మాణాలే దర్శనం ఇస్తున్నాయి. అసలు అనుమతులే లేకుండా కొన్ని నిర్మాణాలు జరుగుతుండగా, కేవలం 2 అంతస్థుల అనుమతితో ఏకంగా 5 అంతస్థుల నిర్మాణం చేపడుతున్నవి కొన్ని. వీటితో పాటు రెసిడెన్షియల్ అనుమతితో కమర్షియల్ భవనాలు నిర్మిస్తున్నారు. శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు టిఎన్జీఓ కాలనీలో వందల కొద్దీ అనుమతి లేని నిర్మాణాలు కొనసాగుతున్నా తమకు పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. నిబంధనలు పాటించేలా చూడాల్సిన ప్రభుత్వ అధికారులే నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతుండగా, ప్రభుత్వ అధికారులకు ఒక న్యాయం.. ప్రజలకు ఒక న్యాయమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

