
హైదరాబాద్ : దశాబ్ద కాలంగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలను ఒక్కరోజులో రోడ్డున పడవేశారు శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు. వర్షా కాలంలో వలస జీవులకు నెలువనీడ లేకుండా చేశారు. గుడిసెల్లో ఉన్న సామగ్రిని, తినుబండారాలను ధ్వంసం చేయడంతో కట్టుబట్టలతో పేదలు రోడ్డున పడ్డారు. గచ్చిబౌలి పరిధిలోని వినాయక నగర్లో ఉన్న 2వేల గజాల ప్రభుత్వ స్థలంలో 20 గుడిసెలు వేసుకుని పేదలు గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కాగా సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు గుడిసెలను తొలగించారు. జెసీబి తో గుడిసెలను కూల్చివేసి, అందులో ఉన్న సామగ్రిని రోడ్డున పడవేశారు. కొంతమంది పేదలు గుడిసెల్లో నుంచి కదిలేందుకు నిరాకరించగా, పోలీసుల సహాయంతో వారిని ఈడ్చివేశారు. నోటీసులు లేకుండా, ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా తమను వర్షా కాలంలో రోడ్డుపాలు చేసారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపార్టుమెంట్ల మధ్య తమ గుడిసెలు వికారంగా ఉన్నాయనే కుట్రతోనే తమ నివాసాలు కూల్చివేశారని వాపోతున్నారు. చిన్నపిల్లలు, మహిళలను ఉన్నఫలంగా రోడ్డున పడవేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
