
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ – 19 ఆసుపత్రిని మంగళవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఇప్పటి వరకు కరోనా క్వారంటైన్ కేంద్రంగా సేవలందించిన గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని పూర్తి స్థాయి కోవిడ్ 19 ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. 1500 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని యుద్ధప్రాతిపదికన తీర్చిదిద్దారు. మొత్తం 13 అంతస్థుల ఈ భవనంలో ప్రతి ఫ్లోర్ లో 30 గదులు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో మిలటరీ క్రీడల సమయంలో ఈ భవనాన్ని ప్రభుత్వం క్రీడాకారుల వసతి కోసం నిర్మించింది. అనంతరం ఈ భవనాన్ని సక్రమంగా ఉపయోగించుకోక పోవడంతో ఇప్పటి వరకు ఖాళీగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ భవనాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చింది. కాగా రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ భవనాన్ని పూర్తిస్థాయి కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చేందుకు నిర్ణయించింది. దీంతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టిన అధికారులు 1500 పడకలతో కోవిడ్ 19 ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. ఈ మేరకు మంగళవారం మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ లు ఆసుపత్రి ని పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పడకలు, నీళ్ళ టాంక్ లు, బాత్ రూమ్ లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గదులు, ఎయిర్ కండిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. భోజన వసతి కోసం అధికారులతో చర్చించారు.
