
హైదరాబాద్, నిఘా 24: గచ్చిబౌలిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పక్కనే ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. కమిషనరేట్ పక్కనే, ప్రధాన రహదారి మీద ఉన్న సెంట్రల్ బ్యాంకు బ్రాంచిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత దోపిడీకి విఫలయత్నం చేశారు. అర్థరాత్రి 2.30 ప్రాంతంలో బ్యాంకు కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు సిసి కెమెరాల కేబుల్ కట్ చేసి, స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచేందుకు విఫలయత్నం చేశారు. ఫాల్ సీలింగ్ ను సైతం కూల్చివేసినా స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లేందుకు సాధ్యం కాలేదు. దీంతో చేసేది లేక బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఇతర సామాగ్రిని ఓ ఆటోలో సర్దుకొని పరారయ్యారు.

దాదాపు 3గంటల పాటు వీరి దోపిడీ యత్నం కొనసాగగా, ఉదయం 5గంటల ప్రాంతంలో బ్యాంకు నుంచి పారిపోయారు. బుధవారం ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాయదుర్గం పోలీసులు క్లూస్ టీమ్ లను, డాగ్ స్క్వాడ్ ను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు బయట ఉన్న సిసి కెమెరాలో దొంగల కదలికలు రికార్డ్ అయ్యాయి. ఓ పురుషుడు, ఓ మహిళ ఈ చోరీకి పాల్పడి ఉంటారని, మరికొందరు సైతం వీరికి సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
