
హైదరాబాద్ : ఐటీ కారిడార్ కు అనుకొని ఉన్న గోపన్ పల్లి చెరువులో చేపలు భారీ ఎత్తున మృతిచెందడం వివాదాస్పదంగా మారుతుంది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లిలో గల పెద్ద చెరువులో ఉన్న చేపలు మంగళవారం భారీ సంఖ్యలో మృతిచెందాయి. గ్రామానికి ఎగువన చెరువు ఉండడంతో అంతగా కలుషితం కాని చెరువు నీటిలో స్థానికులు చేపలు పెంచుతున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాల క్రితం చెరువుకు అనుకొని వెలిసిన ఓ అపార్టుమెంటు డ్రైనేజీ నీరు చెరువులోకి వదులుతుండడంతో స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అపార్టుమెంటు మురుగు నీరు ఓ వైపు కలుస్తుండగా, దశాబ్ద కాలం క్రితం చెరువులో చెపట్టిన ఎస్టీపి ప్లాంటు సైతం నేటికి అందుబాటులోకి రాకపోవడంతో చెరువు నీరు కలుషితం అవుతుంది. ఇదే క్రమంలో మంగళవారం చెరువులో చేపలు మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. ఆది, సోమవారాలు కురిసిన వర్షం కారణంగా చెరువులో దుర్వాసన రావడంతో చెరువుకు ఆనుకొని ఉన్న అపార్టుమెంటు వాసులు చెరువులో రసాయనాలు పిచికారి చేశారని, దీని కారణంగానే చేపలు చనిపోయాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు పిర్యాదు చేశారు.
